నన్ను ఎంతగానో బాధిస్తున్న నడుము నొప్పి నుంచి ఉపశమనము ఎప్పుడు? : కె.పి. జ్యోతిష విశ్లేషణ
- VGR Pavan
- Jul 16, 2023
- 2 min read
Updated: Jul 17, 2023
తనను కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతున్న ఈ సమస్య గురించి ఒక వ్యక్తి ప్రశ్నకు 16th జూలై, 11:43:16 గంటలకు తెనాలి పట్టణమునకు జాతక చక్రం తయారు చేయబడినది.

కృష్ణమూర్తి పద్ధతి ప్రకారము రోగ నివారణ లేదా ఉపశమన్న ప్రశ్నలలో 11వ భావము ప్రధానమైనది. ఇది జాతకుని యొక్క కోరిక నెరవేరునా లేదా అని సూచించడమే కాకుండా ఆరవ భావం నుండి లెక్కించినచో ఆరవ భావముగా వచ్చును కాబట్టి రోగము యొక్క అంత్య సమయమును కూడా సూచించును.
ఈ జాతక చక్రములో ఏకాదశ భావ సబ్ అధిపతి చంద్రుడుగా వచ్చినాడు. చంద్రుడు రాహు నక్షత్రము మరియు శని యొక్క సబ్ నందు నెలకొని ఉన్నాడు. రాహువు 8వ భావ అధిపతి అయిన కుజునికి ప్రతినిధి కాగా శనీశ్వరుడు 6వ భావమునకు అధిపతి అగుట వలన జాతకుని యొక్క ఇబ్బందిని స్పష్టముగా తెలియజేయుచున్నాడు.
ఇటువంటి ప్రశ్నలలో జాతక చక్రంలో ఉన్న చంద్ర స్థితి రోగ నివారణ లేక ఉపశమనము మాత్రమే కాక రోగము వలన కలుగు బాధ మరియు ఆవేదనను కూడా సూచించును. చంద్ర నక్షత్ర మరియు సబ్ అధిపతులు కేవలము రోగ తీవ్రతను సూచించినచో వారి దశాకాలపర్యంతము ఉపశమనమును ఫలితముగా చెప్పరాదు.
11 వ భావ సబ్ అధిపతి చంద్రుడు రాహు నక్షత్రం పై ఉన్నాడు. రాహువు కుజునికి ప్రతినిధి అవుట వలన 11 వ భావ సంబంధము కలిగి ఉన్నాడు రాహువు యొక్క నక్షత్రములపై ఉన్న గ్రహములు 11 వ భావ ఫలితములను ఇచ్చుటలో మరింత సమర్థులు. కాబట్టి చంద్రునికి 11 వ భావ సంబంధము పూర్తిగా ఏర్పడినది కావున ఉపశమనము కలుగునని చెప్పవలెను.
దశ మరియు అంతర్దశల యొక్క బలమును చక్కగా విచారణ చేసి ఫలితములు చెప్పవలెను. ఇచ్చట దశానాథుడు రాహువు గురువుతో కలిసి ఏడవ స్థానమున కేతు నక్షత్రము పై సొంత సబ్ లో ఉన్నాడు. కేతు శుక్ర, కుజులకు ప్రతినిధి కావున 11 వ భావముతో బలమైన సంబంధం కలిగి ఉన్నాడు. అటువంటి కేతు నక్షత్రంపై ఉన్న రాహువు ఉపశమనమును కలుగజేయుటకు అధికారము కలిగి ఉన్నాడు.
శని అంతర్దశ 26 జూలై నాకు పూర్తి కాగా బుధ అంతర్దశ ప్రారంభమగును. అధిపతి అయిన బుధుడు దశమ స్థానమున శని యొక్క నక్షత్రము మరియు గురుని సబ్ లో ఉన్నాడు. వక్రగతి గల శని అనుకూల ఫలితములు ఇచ్చుటలో ఆలస్యం చేయును అని అనిపించినా, బుధునికి 11 వ భావ సంబంధము గురుని ద్వారా కలిగినది. కావున వక్రగతి ప్రభావము బుధునిపై అంతగా ఉండకపోవచ్చు. శీఘ్ర గమనము కల బుధుడు చరరాశి లో ఉన్నాడు కావున తన అంతర్దశ ప్రారంభమైన వెనువెంటనే ఫలితములు అనుభవంలోనికి తేగలడు. కావున 26 జూలై తరువాత నొప్పి యొక్క తీవ్రత తగ్గుతూ వచ్చును.
గురుదేవులు కృష్ణమూర్తి గారు, ప్రకాశక గ్రహములైన సూర్యచంద్రులు ఫలితములు అనుభవములోనికి తెచ్చుట లో కీలక పాత్ర పోషించుడు అని చెప్పినారు. సూర్యుడు గోచారంలో బుధ గ్రహము యొక్క స్థితిని దాటునప్పుడు ప్రారంభమై సింహరాశిలోని శుక్ర గ్రహము యొక్క స్థితిని దాటునప్పటికీ ( ఆగస్టు 20) మరింత ఉపశమనము కలుగును.
ఫలిత నిర్ణయము
జూలై 26 మొదలుకొని ఆగస్టు 24 నాటికి నొప్పి యొక్క ఉపశమనము దాదాపుగా కలుగు. వక్రగతి కల శని యొక్క దృష్టి దశ అధిపతి అయిన రాహువు పై పడుట వలన పూర్తి ఉపశమనము నవంబరు నెలాఖరుకు కలుగవచ్చు.
శుభమస్తు!
Comentários